రక్షాబంధనం, జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, హయగ్రీవ పూజ లేక వరుణ పూజ
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ''రాఖీ'' కట్టి, ''పది కాలాలపాటు చల్లగా ఉండాలని'' మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు.
జంధ్యాల పూర్ణిమ కూడా కనుక జంధ్యాలు ధరించే వారందరూ ఈ రోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తి చెయ్యడం రోజునుండే ప్రారంభిస్తారు.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
పై మంత్రాన్ని పఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.
బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.
ఈ పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టే చెల్లాయిలే మనకు ఎక్కువగా కన్పిస్తుంటారు. తమ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చివరి వరకు కాపాడే రక్షకులుగా సోదరులుండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కట్టడం సంప్రదాయం. రాకీలతోపాటు పూజాథాలీ (పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
అయితే సోదరులకే కాకుండా.. భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చునని, రాఖీకి చాలా పవిత్రత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే? భార్య-భర్తకు, సోదరి-సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై, సుఖసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
పూర్వం యజ్ఞ యాగాది క్రతువులు చేసే సమయంలోఆశ్రమ వాసులు ఆహూతులకు రక్షాబంధన సూత్రాలు కట్టేవారట. వారు దానిని ఆశ్రమ వాసుల్ని వారి క్రతువుల్ని కాపాడే భారం వహిస్తున్నట్టే ప్రమాణ సూత్రంగా భావించేవారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం దేవతల రాజైన శచీదేవి కట్టి రక్షాబంధనం వల్లే వృత్తాసురునితో సంగ్రామంలో విజయం సాధించాడని ద్వాపర యుగంలో ఓసారి శ్రీకృష్ణుని చేతికి గాయం కాగా ద్రౌపది తన చీరకొంగును కొద్దిగా చించి కట్టిన ఫలితంగా కౌరవులు ద్రౌపదికిని నిండు సభలో వస్త్రాపహరణం చేయు సమయంలో శ్రీకృష్ణుడు చీరలిచ్చి కాపాడిన విషయం మనకు తెలిసిందే. మహాలక్ష్మీ వైకుంఠుని కోసం బలి దగ్గరకు వెళ్లి చేతికి రక్షాబంధనం కట్టిందట. క్రీ.పూ. 326లో పురోషోత్తముడికి రొక్సానా కట్టిన రక్షా బంధనం వలనే అలెగ్జాండరు ప్రాణాలు రక్షింపబడ్డాయి అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది.
ఇలా రక్షాబంధనం గురించి మన పురాణాలో పెక్కు కథలున్నాయి. రక్షాబంధనం అనేది ఒక శక్తి వంతమైనది. మనం నిర్వహించే వ్రతాలకు నోములకు వేద మంత్రోచ్చారణలతో మన చేతికి రక్షా కంకణం కడతారు. వ్రతానికైనా, నోముకైన యజమానులు చేసే దీక్షకు రక్షణ అధికారం పొందటానికి రక్షాబంధనం చేస్తారు. మగవారు ఎడమ చేతికి స్ర్తిలు కుడిచేతికి ఈ రక్షబంధనం చేయడంసంప్రదాయంగా వస్తోంది.
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం : విద్య ,ఉద్యోగం,ప్రేమ ,పెళ్లి,సంతానం,అప్పుల బాధలు,విదేశీ యానాం ఇలా ఏ సమస్య అయిన శీఘ్రమే పరిష్కారం కొరకు మాకు సంప్రదించండి,మా (వాట్సాప్) నెంబర్ 9704840400.
పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి ఆ నక్షత్రానికి సంబంధించిన పేరు పెట్టడమనేది మన ప్రాచీనులు ఏర్పాటు చేసిన ఓ విధానం. ఈ శ్రావణ పూర్ణిమ నాడు సోదరి ఓ పట్టు దారానికి జరీ పువ్వును గాని దంతం పువ్వుగాని కట్టి సోదరి తన క్షేమాన్ని కోరుకొమ్మని వేడుకొంటూ తన సోదరునికి చేతికి కడుతుంది. ఇది సోదరి సోదరుడికి కట్టే రక్ష. కనుక దీనిని రక్షాపూర్ణిమ అంటారు. లేక రాఖీ పూర్ణిమ అంటారు. ఈ రాఖీ పూర్ణిమ నాడు రక్షాబంధనాన్ని సోదరీమణుల చేత కట్టించుకొనే వారికి అపమృత్యువు ప్రాప్తించదని యమధర్మరాజు తన చెల్లెలైన యమునకు వరమిచ్చాడు. కనుక అన్నా చెళ్లెళ్ల మధ్యసంబంధం తోడు కలకాలం నిలువాలనే భావన రాఖీ కట్టించుకున్నవారిలో ఉండాలనేది మన సంప్రదాయం. ఈ శ్రావణ పూర్ణిమ నూలి పున్నమి అని నూలి పున్నమి అంటే యజ్ఞోపవీతం వేసుకొనే పున్నమి. నూల్ అంటే యజ్ఞోపవీతం. తమిళంలో దీనినిపూనుల్ అంటారు. ఆరోజు కొత్తగా వడుగైనవారు, మిగిలిన వారు జందెం మార్చి కొత్త జందెం ధరిస్తారు. యజ్ఞోపవీతాన్ని లేనిదే ఏ వ్యక్తీ కూడా శుభ అశుభ కార్యక్రమాలు వేటినీ నెరవేర్చకలేకపోతాడు. కనుక అతి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని ధరించాలని వేదం చెప్తోంది. వేదాధ్యయన ప్రారంభానికి ప్రతీకయైన ఉపాకర్మ కూడా ఈ శ్రావణ పూర్ణిమ నాడే చేస్తారు. అసలు ఈ శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ గా కూడా పిలుస్తారు.
రాఖీ పౌర్ణమిని ''బలేవా'' అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెల పోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, భ్రాతృ ప్రేమతో ''ఏం కావాలమ్మా'' అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు.
ద్రౌపదీ శ్రీకృష్ణుల సోదర ప్రేమ
మహాభారతం ప్రకారం ద్రౌపదికి, వస్త్రాపహరణం సమయంలో, మహా రాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపద రాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచిస్తుంది.
శ్రీ మహావిష్ణువు విజయగాధా
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
భవిష్యోత్తర పురాణం
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది.
శ్రావణ పూర్ణిమ విశిష్టత
శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం.ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. దీన్నే కజరి పూర్ణిమ, నారియల్పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రుషి తర్పణం,రాఖీ పున్నమి.
శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు.
శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్ణిమ అంటారు.
"శ్రావణపౌర్ణమి"నే జంథ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల రుషి తర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. "జంథ్యం" వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు.