Friday 24 April 2020

వైశాఖ పురాణం-vaisakha puranam

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

మొదటి అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వైశాఖమాస ప్రశంస

సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు.

🔷 వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి?

🔷 ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి?

🔷 మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును?

🔷 వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి?

మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.
                 

నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు.

💠 విద్యలలో వేదవిద్యవలె,
💠 మంత్రములలో ఓంకారమువలె,
💠 వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె,
💠 ధేనువులలో కామధేనువువలె,
💠 సర్వసర్పములలో శేషునివలె,
💠 పక్షులలో గరుత్మంతునివలె,
💠 దేవతలలో శ్రీమహావిష్ణువువలె,
💠 చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె
💠 యిష్టమైన వానిలో ప్రాణమువలె,
💠 సౌహార్దములు కలవారిలో భార్యవలె,
💠 నదులలో గంగానది వలె,
💠 కాంతి కలవారిలో సూర్యుని వలె,
💠 ఆయుధములలో చక్రమువలె,
💠 ధాతువులలో సువర్ణమువలె,
💠 విష్ణుభక్తులలో రుద్రునివలె,
💠 రత్నములలో కౌస్తుభమువలె,
💠 ధర్మహేతువులగు మాసములలో     వైశాఖమాసముత్తమమైనది.




విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


    

అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


రెండవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


              వైశాఖమాసమున చేయవలసిన
              వివిధ దానములు వాని ఫలితములు

నారద మహర్షి అంబరీష మహారాజు తో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసము తో సమానమైన మాసము లేదు. కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు. జల దానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖము తో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు.

నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి,వ్యవసాయము తో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.

శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు  ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను - వైశాఖమాస వ్రతమును పాటింపనిచో - యివి అన్నియు వ్యర్ధములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతములెన్నియో ఉన్నవి.ఆ వ్రతములన్నియు - తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును. అనగా ముక్తినీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము - పునర్జన్మను పోగొట్టును , అనగా ముక్తిని ఇచ్చును.

అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున - జలదానము చేసినంతనే వచ్చును. జల దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రభోదించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునకు - జల దానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును.

        

బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో వాని కులము లోని వారందరూ పుణ్యలోకములు నందుదురు జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచుటచే బాటసారులు ,సర్వ దేవతలు ,పితృదేవతలు ,అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగ సత్యము సుమా.దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడిన వాడు నీడను కోరును. చెమట పట్టినవాడు -  విసరుకొనుటకు - విసనకర్రను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును గొడుగులు విసనకర్రలు దానమియ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును. (చాతకమను పక్షి - భూస్పర్శకల నీటిని త్రాగినా చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను - క్రింద పడకుండా - ఆకాశముననే త్రాగి ఉండును . ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.

దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి / బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయనివారు -  బహువిధములైన వాతరోగములంది పీడితులు అగుదురు.ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో - పై బట్ట (ఉత్తరీయము వగైరా) తో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నొందును .పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును.అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసనకర్రను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.

       

గొడుగును దానము చేసినచో - ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను (చెప్పులను) దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి - చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు -బాటసారులకు ఉపయోగించినట్లుగా - అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించినవాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు.

                       

మధ్యాహ్న కాలమున అతిధిగా వచ్చిన వానిని /బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమము. కావున అన్న దానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గల వానికి,భార్య ,సంతానము ,గృహము ,వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టము కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము.కానీ ఆకలి తీరినచో ఇవి అన్నియు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా - అన్నము - భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది . అట్టి అన్నదానము అన్ని దానముల కంటె ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానముల తో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు . ముందు కాలమున కూడా ఉండబోదు .

వైశాఖ మాసమున అలిసిన బాటసారికి /బ్రాహ్మణునికి - జల దానము, ఛత్రదానము, వ్యజన దానము, పాదుకా దానము, అన్నదానము , మున్నగువానిని చేయనివారు పిశాచమై,ఆహారం దొరకక తన మాంసమును భక్షించునట్టి దురవస్థను పొందుదురు . కావున త్రిలోకవాసులందరును, అన్నదానము మున్నగువానిని యధాశక్తిగా చేయవలయును . రాజా ! అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు . కానీ అన్న దానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజ మైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు సర్వ ధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు (వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు (వారిని పూజించిన ఫలము) సర్వ ధర్మములు (అన్ని ధర్మములు నాచరించిన ఫలము) కలుగును భావము.

!!వైశాఖ పురాణం రెండవ అధ్యాయము సంపూర్ణము!!

మూడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వివిధ దానములు - వాని మహత్మ్యములు

నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా? మరి యింకనూ ఉన్నవా? అవి యేవి? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.

అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును(మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి/బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు/సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును(పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై/చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును, సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట/శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.

ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను, సుగంధద్రవ్యమును, కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు, ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.

సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న యిసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.

మార్గమున తోట, చెరువు, నూయి, మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము,పరులకుపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.

సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము(రావి చెట్టును నాటుట) పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.

ఉత్తమములైన పోకచెక్కలు, కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము, రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు, ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు/సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.

విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల యాశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.

నాలుగువ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
                   

                             వైశాఖధర్మ ప్రశంస

నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు, వెండిపాత్రలలోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.

వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమమాసమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.

విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ/తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము.

శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.

రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.

కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్తృప్రేమను కలిగియున్నను, వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచోయన్నియు వ్యర్థములగును సుమా! శాక సూపాదులు(కూర పప్పు) యెంత యుత్తమములైనను, యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్ళు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, యింద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.

వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.

మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |
ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||

పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.

వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |
అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||

గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||

ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||

అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి/పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను/చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.

వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.

తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి 'హరి' యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని 'శవము' వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.

పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.

వైశాఖ పురాణము నాలుగువ అధ్యాయము సంపూర్ణము


అయిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                  
                        వైశాఖమాస విశిష్టత

నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.

ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.

సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ  ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.

అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.

ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.

శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ! తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాసవ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు. కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.

వైశాఖ పురాణం అయిదవ అధ్యాయము సంపూర్ణము


ఆరవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

       జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ

నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.

పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.

ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.

మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.

శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.

శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?

తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.

ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.

వైశాఖ పురాణం ఆరవ అధ్యాయము సంపూర్ణము


ఏడవ అధ్యాయము :-


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


                  వైశాఖమాస దానములు

అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగుగ వినుమని యిట్లు వివరింపసాగెను.

రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము యివి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.

సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను యిచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.

ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి వలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.

పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్తి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును యీయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా!
వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము సంపూర్ణము

ఎనిమిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                     
                              పిశాచ మోక్షము

పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.

పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.

అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.

నేనును నా తండ్రి యజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.

కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు  శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.

ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.

వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము

తొమ్మిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
                        

                            సతీదేహ త్యాగము


అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని యిహలోక సంబందము, పరలోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబందములుగ జలసేవ, అన్నసేవ, ఔషధసేవయని యిహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును యిహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గసేవయను మూడును ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.

ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగ యిహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు, విష్ణు, ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు యిష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన యితివృత్తమును వినుము. పార్వతీ! యీ  కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును, ఆనందమును కలిగించును.

పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి "నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను, చంద్రుడు, యింద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు, ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను, పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని యిచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ, భార్యను జూచి భర్త లేచినట్లుగ, సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను, దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు.


కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని, ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే యిట్లనెను. ఓహో! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును, యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును? లోకములు, శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది యితని యైశ్వర్యము. ఇట్టి యీతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. 'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల యితనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు" అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను.

యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.


పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.

యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను.

తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి యిట్లు పలికెను. తండ్రీ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త-లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా? ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి? విధివిధానము వీరికి విముఖమైయున్నదా? అని సతీదేవి పలికెను.

సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను, తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను, శివుని బహువిధముల నిందించెను.

రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి.

వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము


పదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

          

            దక్షయజ్ఞ నాశము కామదహనము


రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతినిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.

ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు, వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.

బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రదికింపజేసెను, శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రదికించెను, మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.

యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.

యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను.

దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.

ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను, సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను, తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.

దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె యెప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను.

దేవతలందరును యింద్రుని యింట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును, మనధుడు యింద్రుని వద్దకు వచ్చిరి.

ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు యింద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.

నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను.

మన్మధుడును యింద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను, భార్యయగు రతీదేవితోను, మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.

అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము, మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.
బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను.


తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.

మన్మధుడు చేసినపని దేవతలకు, శివునకు యిష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు?

కావున శ్రుతకీర్తి మహారాజు! యిక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని, అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.

పరమపుణ్యప్రదమైన యీ కధను, రాత్రిగాని, పగలుగాని యెవరు విన్నను, జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.

వైశాఖ పురాణం పదవ అధ్యాయము సంపూర్ణము



వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
రతి దుఃఖము - దేవతల ఊరడింపు
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.
కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.
శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.
ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్ర్హస్పతి యింద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి యిట్లనిరి.
కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే యితని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువునర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.
రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవుటవలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున యిహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!
వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం  పన్నెండవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                         కుమార జననము

మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను యింటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును, ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.

పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.

శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని  యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు నిష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు యీయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.

లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు, మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.

హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని యింటను, రాత్రులయందు సరస్తీరముల యందు, పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.

వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు యిప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి సివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.

శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి యిచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.

అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.

బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము, పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.

పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.

రాజా! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను, వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున వైశాఖమాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును, మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను, పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు, భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.

వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయము సంపూర్ణము
వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                     అశూన్య శయనవ్రతము

నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు "మునివర్యా! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను.

అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును?

శ్రావణమాసమున శుద్దవిదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు/వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.


తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము అను మాసములందు శ్రీహరిని/రుక్మిణీ సహితముగ యెఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ యందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.

మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ, హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను, శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణప్రతిమను మార్గశీర్షాదిమాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.

లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన !
శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ !!

అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై యున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.

ఈ వ్రతమును, భార్యలేని పురుషుడును, విధవాస్త్రీయును, దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన యనుగ్రహమునంది జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై యుందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.

శ్రుతకీర్తి మహారాజు మహామునీ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.

వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయము సంపూర్ణము




వైశాఖ పురాణం పద్నాలుగువ అధ్యాయము :-


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||



                         ఛత్రదాన మహిమ


శ్రుతదేవమహాముని యిట్లు పలికెను. వైశాఖమాసమున యెండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు యెండ వలని బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము.

పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ యిది వంగదేశమున సుకేతు మహారాజుకుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.

అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.

పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యాదోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.

వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని యిచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును, సొరకాయ బుఱ్ఱనీటిని యిచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.

దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని యిచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు బంపెను.


భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యము నిచ్చి విష్వక్సేనుని యనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపమాచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.

హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖవ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము నవలంభించి, శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది, పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను, అని నారదుడు అంబరీషునకు చెప్పెను.



వైశాఖ పురాణం పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 


వైశాఖ పురాణం పదిహేనువ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                        వైశాఖవ్రత మహిమ

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.

శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.

వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.

అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.

అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.

వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహికరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని సిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.

ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.

వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయము సంపూర్ణము


వైశాఖ పురాణం పదహారువ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                      
     యముని పరాజయము

అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.

యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.

అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ
త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా
త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||
నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః
తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||

అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.

అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.

ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.

దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.

వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డ్గించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు 'అయ్యో' అని అతిదీనముగ బలికెను.

వైశాఖ పురాణం పదహారవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం పదిహేడువ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                           యమదుఃఖ నిరూపణము

నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.

వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.

స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును.



ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాతించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు.



వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము. అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.

కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడుకదా! ఇట్లు నా వ్రాత నెవరును యింతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.
వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం పదిహేడువ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

యమదుఃఖ నిరూపణము

నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.

వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.

స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును.

ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాతించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు.

వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము. అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.

కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడుకదా! ఇట్లు నా వ్రాత నెవరును యింతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.


వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం పద్దెనిమిదివ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                       విష్ణువు యముని ఊరడించుట

నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.

యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవరు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా! యమధర్మరాజా! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి/సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.

అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు యిద్దరును శ్రీహరికి నమస్కరించిరి.

శ్రీహరియు వారిద్దరిని జూచి "మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని యేల నుండెను? బ్రహ్మ! యీ విషయమును చెప్పుమని" యడిగెను.

అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని, బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతీమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను?

యమధర్మరాజా! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలదిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా! అప్పుడు నీకు వలసి నంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా! (ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము) వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున యమధర్మరాజా! నీకు యీ విధముగా భాగము నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుపుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగముగ గ్రహింపుము. ఇట్లు చేయనివారి వైశాఖకర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపముల ననుసరించి నీ లోకమున నుందురు. ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నాయాజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖవ్రతమున నీకు అర్ఘ్యమునీయనివారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నామాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము నిప్పించును. అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగనే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి యా విషయమును చెప్పెను.

శ్రీహరి యీ విధముగ యమధర్మరాజు నూరడించి యంతర్ధానము నందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగినదానికి విస్మయపడుచు తన వారితో గలసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీమహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు, వాని యేలుబడిలోని ప్రజలు అందరును వైశాఖవ్రతము నాచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నానసమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైన అర్ఘ్యము మున్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖవ్రత ఫలమును గ్రహించును.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజింపవలయును, తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు/పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.

ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి యిహలోక సుఖములు, సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే యిది సాధ్యము సుమా అని శ్రుతదేవుదు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు యిక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.

శ్రుతదేవుడును రాజా! యుగములనుబట్టి, కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆకథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము


వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                              పిశాచత్వ విముక్తి

నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.

శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.

వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.

పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.

వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో, తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.

విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము, ధ్యానము, మననము, ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము, విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని, విష్ణుకథగాని, సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.

ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన యిష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ యింటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.

ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు యెండిన పెదవులు, నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.

ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని సిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా యదృష్టవశమున మీ దర్శనమైనది. నాను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై బడి దుఃఖించెను.


సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను. ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు-సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.

శ్రుతకీర్త మహారాజా! కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు యిహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు యిహము, పరము, నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |
తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||

ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |
కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||

ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |
బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.

వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

ఇరవైవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                         పాంచాలరాజు రాజ్య ప్రాప్తి

నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.

పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.

వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.

రాజు వారిద్దరికి నమస్కరించి యధాశక్తిగను ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.

బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.

నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.

అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.

నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.

రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.


వైశాఖ పురాణం ఇరవైవ అధ్యాయము సంపూర్ణము



వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్

               పాంచాలరాజు సాయుజ్యము

నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.

పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి  నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.

నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1||


ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2 ||


సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3 ||

తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4 ||

ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5 ||

భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6 ||

తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7 ||

వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8 ||

తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9 ||

ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10 ||

నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11 ||

త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12 ||

నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13 ||

పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14 ||

పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15 ||

సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16 ||

సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17 ||

ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18 ||

అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19 ||

ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20 ||

భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21 ||

ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22 ||

కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23 ||

హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24 ||

త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25 ||
అని స్తుతించెను.

పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే.

️1.స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.

⏺️2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.

⏺️3.స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.

⏺️4.తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.

⏺️5.స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.

⏺️6.నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.

⏺️7.ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.

⏺️8.ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.

⏺️9.అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.

⏺️10.నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.

⏺️11.స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.

⏺️12.మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.

⏺️13.స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.

⏺️14.నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.

⏺️15.స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.

⏺️16.సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.

⏺️17.ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.

⏺️18.స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.

⏺️19.కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.

⏺️20.జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.

⏺️21.ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.

⏺️22.నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.

⏺️23.నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.

⏺️24.నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.

⏺️25..ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.

ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును.

ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.


వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.

పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.


వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్
                   దంతిల కోహల శాపవిముక్తి

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.

శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.

పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.

అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.

శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.

శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.

కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా.

శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.

ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.

కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను.


ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.


వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం

వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

                             కిరాతుని పూర్వజన్మ

నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.

కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.


అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.

ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.

ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.


నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

                                వాయు శాపము

అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.

శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.

శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.

బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.

ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.

అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.

స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.

శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.

ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.

అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.

ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||
భాగవత ధర్మములు
నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.
స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.
అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.
రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.
సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.
సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను - అశుభములను, సుఖమును - దుఃఖమును, మంచిని - చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.
కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.
మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావరజంగమములన్నియు లోకములతో బాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును.
తత్త్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతోబాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యధాప్రకారముగ జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మసృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను శ్రీహరి యవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మ కల్పము ముగియు వరకునుందురు. ఆయా రాశులయందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేదధర్మములననుసరించు నాయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు.
కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచగణముల యందున్నవారు తమ కర్మలననుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు.
బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తి కాలమును వినుము. శ్రీమహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరల కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగినవారు, లింగశరీరులు లింగశరీర భంగమైనవారునగు జీవులనేకులుందురు.
శ్రీమహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగ నున్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు లింగభంగశరీరులు పిపీలికాదిమానవాంత జీవులు, ముక్తినందినవారు, బ్రహ్మ మొదలు మానవులవరకు నుండు జీవులు వీరందరునుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యము నిచ్చును. కొందరికి తత్త్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారివారికి తగినట్లుగ అనిరుద్ద వ్యూహముననుసరించి వారి వారికి యిచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయజయకృతిశాంతియను నాలుగు శక్తులను, వాసుదేవ అనిరుద్ద ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహములనుండి వరించెను. ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీమహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను.
యోగమాయను నాశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి యగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదుల కైనను యెరుగరావు అని శంఖుడు వివరించెను.
అప్పుడు కిరాతుడు స్వామీ! శ్రీమహావిష్ణువున కిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను. దయయుంచి చెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. చిత్తశుద్దిని కలిగించి సజ్జనులకుపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శ్రుతిప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్దము కానిదియగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణములచేత, బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్యనైమిత్తిక కామ్యములని మూడు రీతులుగ విభక్తములైనవి. నాలుగు వర్ణములవారును తమ తమ ధర్మములనాచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచోనవి సాత్విక ధర్మములని యందును. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములనియనిరి.
శ్రీమహావిష్ణువును విడిచి మరియొక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువు నందును, నాలుక శ్రీహరి నామోచ్ఛారణయందును హృదయము విష్ణుపాదముల యందును సక్తములై యుండునో వారే భాగవతులు. సదాచారములయందాసక్తి కలిగి అందరికి నుపకారమును చేయుచు, మమకారము లేనివారు భాగవతులు. వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగాగలవి రాజసధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు సత్త్వగుణము కలవారు. విష్ణుప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగజేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు భక్తులు.
వేదశాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతికరములైన ధర్మముల నాచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తిలేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నియు జ్ఞానులకుపయోగింపవు. చంద్రుని జూచి చంద్రకాంత శిలద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును.
ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుటవలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్దతో కూడి విష్ణుప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.
బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.
ఈ విధముగ శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.
శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |
సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |
దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||
పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.
శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |
సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||
తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |
ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||
చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.
అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.
వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||
వాల్మీకి జన్మ
నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.
తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.
శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.
ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.
ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టుతొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.
శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.
ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!
శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.
ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.
శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.
అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.
అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.
కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.
శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.
వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము


వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||
కలిధర్మములు - పితృముక్తి
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.
అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలని ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.
పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరునుండరని భావము.
దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు(భార్యలేనివారు), స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును. ఆ తిధినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.
ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.
అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించినవచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.
ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ యీ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.
ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.
భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.
జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.
ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక యెలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన యెలుకగడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.
ధర్మవర్ణుడును దీనులై ,యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను యిది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును యీ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన యీ గడ్డికి అంకురములులేవు. ఈ యెలుక యీ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ యెలుక మిగిలిన యీ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.
కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన యెలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ యెలుకయే కాలము. ఇప్పటికి యీ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు యిందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగువి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.
తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.
ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై యిట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము యిష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.
ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని యెట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణుకథలయందనురక్తి, స్మరణము, సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని యింటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.
ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను

వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము


వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


                      అక్షయతృతీయ విశిష్టత

నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.

పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.

ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.

ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.

ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు  చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.


వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణంఇరవై తొమ్మిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

                                 శునీ మోక్షప్రాప్తి

నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.

మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.

పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె యిచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని యారోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని యింట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.

ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి యరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి యరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు.

అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి యేమని పుత్రుని యడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని యాశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు యిట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే యున్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచిదేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా! కావున నేను దీనురాలై అడుగుచున్న యీ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి యుద్దరింతును అని పలికెను.


ఇట్లు పలికి ద్వాదశినాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్ళు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను దెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్యవిమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములననుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవమునుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్దినందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి, యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిధిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిధి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటె సమస్త యజ్ఞయాగాదులకంటె అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వైశాఖశుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.


వైశాఖ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం ముప్పైవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

                           పుష్కరిణి - ఫలశ్రుతి

నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.

దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని  యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.

శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.

మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.

నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.

ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.


వైశాఖ పురాణం ముప్పైవ అధ్యయము సంపూర్ణము