* మేష రాశి *
*ఆదాయం–8, వ్యయం–14,*
అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి.
అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది.
గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి.
అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం.
శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా వరాహ స్వామి ద్వాదశనామ స్తోత్ర పారాయణ చేయండి. ‘శ్రీ వరాహాయ నమః అని చెబుతూ విష్ణాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం.
ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి.
మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి.
జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి.
జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు.
ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం.
సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి.
అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి.
షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి.
నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి.
డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు.
జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం.
ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు.
మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది.
* వృషభ రాశి *
*ఆదాయం–2, వ్యయం–8,*
*రాజయోగం–7, అవమానం–3.*
కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)
గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు.
వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు.
ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి.
కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం.
కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు.
శాంతి మార్గం: తరచుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. రోజూ విష్ణాలయంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ చేయండి.
ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం.
మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు.
ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం.
జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది.
జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.
ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.
అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం.
నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు.
జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి.
ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం.
మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి.
* మిథున రాశి *
*ఆదాయం–5, వ్యయం–5,*
*రాజయోగం–3, అవమానం–6.*
మృగశిర 3,4 పాదములు (కా, కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)
గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి.
మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది.
అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి.
షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు.
మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ.
ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి.
శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. వామన( త్రివిక్రమ) అవతారానికి పూజ చేయాలి. ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి.
ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి.
మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు.
జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు.
జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం.
ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి.
కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు.
సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి.
ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది.
అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు.
నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ.
డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత.
జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు.
ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ.
మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది.
* కర్కాటక రాశి *
*ఆదాయం–14, వ్యయం–2,*
*రాజయోగం–6, అవమానం–6*
పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)
గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి.
మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది.
ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి.
మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది.
పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు.
శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. కూర్మావతారానికి, వరాహవతారానికి, పూజ చేయాలి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి.
ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు.
మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం.
జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం.
జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు.
ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం.
సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి.
అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు.
నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన.
డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం.
జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం.
ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం.
మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు.
* సింహ రాశి *
*ఆదాయం–2, వ్యయం–14,*
*రాజయోగం–2, అవమానం–2.*
మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)
ఉత్తర 1వ పాదము (టే)
గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు.
మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది.
జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది.
ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ.
మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి.
శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం కూర్మావతారానికి, వరాహావతారానికి, పూజ చేయాలి. ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి.
ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు.
మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం.
జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు.
జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి.
ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ.
సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది.
13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి.
నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ.
డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి.
జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ.
ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం.
మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
*కన్యా రాశి *
*ఆదాయం–5, వ్యయం–5,*
*రాజయోగం–5, అవమానం–2.*
ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)
హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)
చిత్త 1,2 పాదములు (పే, పో)
గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు.
మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.
పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి.
తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి.
గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు.
ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు.
శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ వారాహస్వామిని , మత్యావతార స్వామిని అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘వరాహ’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి.
ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు.
మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం.
జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు.
జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి.
ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది.
సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం.
అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం.
నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు.
డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు.
జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. ఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే.
ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు.
మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం..
*ఆదాయం–2, వ్యయం–8,*
*రాజయోగం–1, అవమానం–5.*
చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)
గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది.
కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది.
ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి.
చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు.
శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో లక్ష్మీదేవిని అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి సుదర్శన నారసింహ హోమం చేయండి. రోజూ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ.
జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.
జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి.
ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు.
సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ.
అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం.
నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం.
డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి.
పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం.
మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. .
*వృశ్చిక రాశి *
*ఆదాయం–8, వ్యయం–14,*
*రాజయోగం–4, అవమానం–5.*
విశాఖ 4 వ పాదము (తొ)
అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)
గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది.
మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి.
ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది.
విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
శాంతి మార్గం: శని, గురు, రాహువులకు వరుసగా కూర్మావతారానికి, త్రివిక్రమావతారానికి, వరాహ స్వామికి పూజ చేయించండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు.
మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం.
జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం.
జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.
సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు.
అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి.
డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి.
జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి.
ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి.
సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి.
మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు.
* ధనూ రాశి *
*ఆదాయం–11, వ్యయం–5,*
*రాజయోగం–7, అవమానం–5*
మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)
ఉత్తరాషాఢ 1వ పాదము (బే)
గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి.
ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది.
ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు.
కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష.
మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు.
శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువు కొరకు వరాహస్వామిని , మే నెలలో గురువుకొరకు త్రివిక్రమ స్వామికి పూజ చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో లక్ష్మి అమ్మవారి అర్చన చేయడం, సాయంకాలంలో విష్ణాలయంలో 11 ప్రదక్షిణలు చేసి నృసింహస్వామి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం.
ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు.
మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ.
జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి.
జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం.
ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం.
సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు.
అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం.
నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ.
డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ.
జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి.
ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.
పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి.
మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది.
* మకర రాశి *
*ఆదాయం–14 , వ్యయం–14,*
*రాజయోగం–3, అవమానం–1* .
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)
శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)
గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే.
ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి.
పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది.
గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు.
ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది.
శాంతి మార్గం: లక్ష్మి అమ్మవారి అర్చన చేయండి. రోజూ నృసింహస్వామి పూజలు చేస్తుండండి. ‘ ఓం నరసింహాయ నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. కూర్మావతారానికి జపం చేయించండి.
ఏప్రిల్: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం.
మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు.
జూన్: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు.
ఆగస్ట్: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.
సెప్టెంబర్: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు.
నవంబర్: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు.
డిసెంబర్: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది.
జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు.
ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి.
మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.
* కుంభ రాశి *
*ఆదాయం–14, వ్యయం–14,*
*రాజయోగం–6, అవమానం–1*
ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)
గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం.
ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి.
తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు.
వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం.
ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి.
ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి.
శాంతి మార్గం: శని, గురువులకు రోజూ కూర్మావతార స్వామికి, వామన ( త్రివిక్రమ) స్వామికి పూజ చేయాలి. ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం.
ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది.
బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు.
మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం.
జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు.
జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ.
ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి.
సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది.
అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు.
డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి.
జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం.
మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం. .
* మీన రాశి *
*ఆదాయం–11 , వ్యయం–5*
*రాజయోగం–2, అవమానం–4*
పూర్వాభాద్ర 4 వ పాదము (ది)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)
గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది.
అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం.
ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి.
పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.
శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ కూర్మావతార స్వామికి, వరాహ స్వామికి, వామన ( త్రివిక్రమ) స్వామికి పూజ చేయాలి. ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో విష్ణాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి.
ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు.
మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం.
జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి.
జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం.
ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ.
సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు.
అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు.
నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం.
డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి.
జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి.
విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ.
ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి.…