ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి: శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము
శాస్త్రము (పురాణము): మార్గశిర మాసం శుక్ల పక్షం లో వచ్చే మొదటి ఏకాదశి ని "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహా విష్ణువు లోని స్త్రీ తేజం 'ముర' అను రాక్షసిని సంహరించి దేవతలను రక్షిస్తుంది. ఆ స్త్రీ మూర్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి, ఆ రోజు ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరేదరని వరం యిస్తాడు. మురని హరించడం వలన శ్రీ హరి 'మురహర' లేదా 'మురహరి' లేదా 'మురారి' అయినాడు. ఈ ఏకాదశి నాడు విష్ణు ఆలయాలలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతారు. ఆ ద్వారం ద్వారా ఆలయం లో ప్రవేశించి దైవ దర్శనం చేసుకున్న వారు మోక్షాన్ని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజును 'మోక్షద ఏకాదశి' అని కూడా అంటారు. అంతే కాదు ఈ దినం ఉపవాసం ఉన్నవారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకము. విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలం. అయితే ఈ ఎకాదశే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాల మంది భక్తుల నమ్మకం. ఈ రోజు వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్రనామ పారాయణం, వేదాన్తిక చర్చలు, పూజలు విశేషంగా చేస్తారు.
శాస్త్ర విజ్ఞానము: అదలా ఉంచితే చాంద్రమాన తిథుల ప్రకారం ఏకాదశి పక్షం లో 11 వ రోజు. ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది. అయితే చాల మంది గమనించే ఉంటారు భూమిపైన, అందు నివసించే మన మనస్సుల మీద చంద్రుని ప్రభావం ఉంది. ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల (పంచమి) వరకు క్రమంగా చంద్రుని ప్రభావము మన శరీరములోని ద్రవ పదార్థములు (ఉదా. రక్తము), మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమ క్రమంగా అధికము అవుతుంది. ఈ ప్రభావము పౌర్ణమి నాడు అత్యధికంగా వుంటుంది. అందుకే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజులలో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి. అందువలన పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళను వారిస్తారు లేదా చాల జాగ్రత్త గా ఉండాలని చెబుతారు. అంతే కాదు, కొందరు మానసిక రోగులకు పున్నమి రాత్రులలో మానసిక రుగ్మతలు విజ్రుమ్భిస్తాయి. మన వాళ్ళు అంటుంటారు "వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త" అని. నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావమే అంటున్నారు శాస్త్రజ్ఞులు.
అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం. ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేయాలి? వేరే రోజులలో చేయవచ్చును కదా! దీనికి శాస్త్ర విజ్ఞానము ఇంకొక విశ్లేషణ ఇస్తోంది. చంద్రుడు 24 గంటలలో 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు. ఈ కాలం ఒక తిథి తో సమానం. సూర్యుని నుండి 180 డిగ్రీలు చలించాక పౌర్ణమి వస్తుంది, మరో 180 డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది. అయితే ఏకాదశి నాడు (కృష్ణ పక్షం గాని, శుక్ల పక్షం గాని) సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్నీతమైన అమరికలో ఉంటారు. ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద, ముఖ్యం గా నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది. అది మన శరీరం లో ఉండే ద్రవ పదార్ధాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ లేదా చలనం మందకొడిగా ఉంటుంది. ఉదాహరణకు మన ప్రేగులలో ఆహార పదార్ధాలు కూడా అతి నెమ్మదిగా కదులుతాయి. తత్ఫలితంగా జీర్ణ క్రియ మందగించి మలబద్ధానికి దారి తీస్తుంది. మల బద్ధం అనేది అన్ని వ్యాధులకు మూల కారణము. అందువలన ఈ రోజు (ఏకాదశి రోజు) ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వలన మరుసటి రోజుకు ఆంత్ర చలనం క్రమ పద్ధతిలోనికి వచ్చి శరీరం తేలిక పడుతుంది. ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది. దీని కోసం ఏకాదశి నాడు కేవలం నీరు (అందులో చిటికెడు ఉప్పు, ఒక అర చెంచా నిమ్మ రసం కలిపి) రోజంతా తీసుకోవాలి. ఈ విధం గా చేయడం వలన మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అది చక్కబడుతుంది.
అందు వలన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్ర రీత్యా పుణ్యము వస్తుంది, విజ్ఞాన శాస్త రీత్యా ఆరోగ్యకరం గా ఉంటుంది. అయితే మనకి భక్తి అంటే గురి కుదురుతుంది, కాని అది విజ్ఞాన శాస్త్ర పరంగా చెబితే ఎంతమంది వింటారో అన్న సంశయంతో మన పెద్దలు భక్తి మార్గానికి ప్రచారం ఇచ్చారేమో. ఏది ఏమైనా ఏకాదశి నాడు (మాత్రమే) ఉపవాసం చేస్తే మనకు మంచిది.
No comments:
Post a Comment