సంతాన అనుగ్రహం కొరకు పుత్ర గణపతి వ్రతం :
గణపతిని ఆరాధించి ఆయన ఆశీస్సులు అందుకుంటే మనోభీష్టం నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే గణపతి ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఏడాదిపాటు తమ పనులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడమని ప్రార్ధిస్తూ వినాయక చవితి రోజున ఆ స్వామిని పూజిస్తూ వుంటారు. అదే విధంగా పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
వారసుడు కావాలనే కోరిక ... తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి ... గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.
ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను ... పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
No comments:
Post a Comment