ధన త్రయోదశి విశిష్టత ఏమిటి?
ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు.
సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో
ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత శ్రీమహాలక్ష్మి
పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.
లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా ధన త్రయోదశి చెప్పబడుతోంది. ఈ
త్రయోదశి రోజున లక్ష్మీదేవికి దీపం వెలిగించి ఎరుపు రంగు తామర పువ్వులతో
పూజించాలి. అంతేకాకుండా లక్ష్మీదేవికి నచ్చిన పదార్థాలను నైవేద్యంగా పెట్టుకుని
పూజలు చేయవలసి ఉంటుంది. ఈ త్రయోదశి రోజున ఈ పూజలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం
తప్పక దొరుకుతుంది. తద్వారా ధనధాన్యాలు చేకూరుతాయి.
దేవదానవులు అమృతం కోసం మథిస్తున్న పాలకడలి నుంచి లక్ష్మీదేవి
ఉద్భవించిందంటారు. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహావిష్ణువు ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడనీ పురాణ గాథలు
చెబుతాయి. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఈరోజున ధనాధిదేవత లక్ష్మీదేవి
జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ
విశ్వాసం. అందుకే దీన్ని ‘ధన త్రయోదశి’గా
పిలుస్తారు.
మరో కథనమూ ప్రచారంలో ఉంది. త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో
తెలుసుకొనేందుకు ఒకరోజున భృగుమహర్షి పయనమవుతాడు. దారిలో వైకుంఠానికి
వెళ్లినప్పటికీ, ఆయన రాకను లక్ష్మీనారాయణులు గమనించరు. మహర్షి
ఆగ్రహించి స్వామి వక్షస్థలాన్ని తన్నినా, ఆయన చలించడు. పైగా
రుషిని శాంతపరచి, సపర్యలు చేసి, పాదాలు
స్పర్శిస్తాడు. అదను చూసి భృగువు అరికాలి నేత్రంలోని అహంకారాన్ని చిదిమేస్తాడు.
అప్పుడు స్వామిని శరణు కోరతాడు ఆ రుషి!
తన నివాస స్థానమైన విష్ణువు గుండెలమీద ముని తన్నడం, లక్ష్మి కోపానికి కారణమవుతుంది. భర్త ఆ ముని పాదాలు తాకడాన్ని భరించలేక
ఆమె భూలోకానికి వెళ్తుంది. ఇదే ఆశ్వయుజ బహుళ త్రయోదశి అని మరికొందరు నమ్ముతారు.
లక్ష్మి భూలోకంలోని కరవీర పురం (నేటి- కొల్లాపూర్) చేరుతుంది. కుబేరుడు అక్కడికి
వెళ్లి, ఆమెను పూజించి, అనుగ్రహం
పొందుతాడు. అందుకే అతడు ఎంతో ధనవంతుడయ్యాడంటారు. ధనాధిదేవత భూలోకానికి చేరిన రోజు
కాబట్టి ఈ రోజును ధన త్రయోదశిగా భావించేవారూ ఉన్నారు.
ఇదే రోజును ‘యమ త్రయోదశి’గానూ పరిగణిస్తారు.
పూర్వం ‘హిమ’ అనే రాజుకు లేక లేక
కొడుకు పుడతాడు. వివాహమైన నాలుగో రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని కొందరు
హెచ్చరిస్తారు. కాలక్రమంలో ఒక రాజకుమారి అతణ్ని వరించి పెళ్లాడుతుంది.భర్తను తానే
కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది. పెళ్లయిన నాలుగో రోజున రాకుమారుడి గది ముందు
బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి- దీపాలు ఉంచుతుంది.
లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో స్తుతిస్తూ, గానం
చేస్తుంటుంది.
అదే సమయానికి, రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము
రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల, ఆయన కళ్లు
చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరచిపోతాడు. మృత్యుఘడియలు దాటి, యముడు శూన్యహస్తాలతో వెనుదిరిగాడన్నది వేరొక కథనం. ఈరోజు త్రయోదశి వేళ,
యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యుభయం ఉండదనీ అంటారు.
ఇవాళ ఆది వైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ‘ధన్వంతరి త్రయోదశి’గానూ భావిస్తారు. అందుకే
వైద్యులు ఘనంగా పూజిస్తారు. మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. అందుకే ‘త్రివిక్రమ త్రయోదశి’గా పిలవడమూ పరిపాటి. ఈరోజుకు
కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని ఇతర పేర్లూ ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ధన త్రయోదశిని మూడురోజుల పండుగగా ఆచరిస్తారు.
లక్ష్మీదేవిని ధనాధిదేవతగా విష్ణువు ప్రకటించడాన్ని నరకాసురుడు భరించలేకపోతాడు.
ఆమెను బంధిస్తాడు. అతడి ఆగడాల్ని అరికట్టడానికి అప్పటికే సత్యభామ సమేతంగా
శ్రీకృష్ణుడు బయలుదేరతాడు. నరకుణ్ని వారు సంహరించి, లోకానికి
ఆ రాక్షస బాధ లేకుండా చేస్తారు. లక్ష్మీదేవి బంధవిముక్తురాలవుతుంది. అందువల్ల
అందరూ ఆమెను ఘనంగా అర్చిస్తారు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ (దీపావళి) అమావాస్య. భక్తులు
ముందుగా లక్ష్మీపూజ చేయడంలోని ఆంతర్యం ఇదే!
గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ
ఉత్సవాన్ని విశేషంగా జరుపుతారు. సూర్యాస్తమయ సమయంలో, మట్టి
ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా ‘యమ దీపాలు’గా ఉంచుతారు. ఈ రోజున చేసే దానాలు,
జపాలు, పూజలు అనేక ఉత్తమ ఫలితాలనిస్తాయని
భక్తులు నమ్ముతారు!
No comments:
Post a Comment