Wednesday, 5 February 2020

నిత్య పూజా విధానాం- ఉపోద్ఘాతం- Nitya Puja Vidhi Vidhanam


నిత్య పూజా విధానాం- ఉపోద్ఘాతం
హిందు ధర్మం ప్రకారం నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు.
Image result for hindu pujalu
పూజా విధానాం :
పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(16 ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(5ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు.
పూజకు కావాలిసినవి :
1. మనస్సులో ధృడ సంకల్పం
2. పసుపు, కుంకుమ, గంధం
3. పసుపు కలిపిన అక్షతలు
4. పువ్వులు, దొరికితే మామిడి ఆకులు
5. కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు
6. పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు
7. అభిషేకానికి పంచామృతాలు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షంలో కలశంలో ఉన్న నీరు చాలు)
8. అభిషేకం కూడా చేయాలనుకుంటే, దాని కోసం పెద్ద పళ్ళెం, అభిషేకం అయ్యక నీళ్ళు/పంచామృతాలు పోయడానికి ఒక గిన్నె
9. అగరవత్తులు, లేక సాంబ్రాణి, అవి పెట్టడానికి ఒక స్టాండు (ధూపం అన్నప్పుడు వెలిగించాలి)
10. దీపం కుందులు (ప్రమిదలు), నూనె, వత్తులు (దీపాలను వెలిగించడానికి సిద్ధంగా తయారుచేసి ప్రక్కన ఉంచుకోవాలి)
11. నైవేద్యానికి పండ్లు లేక అప్పుడే వండిన సాత్త్విక ఆహార పదార్థాలు, అవి లభ్యం కాని పక్షంలో కొంచెం బెల్లం లేదా చక్కెర
12. తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం)
13. హారతి కర్పూరం, హారతి పళ్ళెం
14. వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె
15. ఘంట
16. పంచాంగం (మాసం, అయనం, తిథి, నక్షత్రం చూసుకోవడానికి)
17. చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం
18. కూర్చోవడానికి దర్భాసనంగానీ, అంచు ఉన్న తెల్లటి వస్త్రంగానీ
పూజా విధానం :

పూజకు ముందు కాలకృత్యలు తీర్చుకుని స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని, పూజా స్థానంలో ముందురోజు నుంచి ఉన్న పవిత్ర నిర్మాల్యాన్ని తీసేసి, ఆ స్థానం మరియు దేవతా మూర్తులను శుభ్రం చేయాలి. నిశ్చయించుకున్న దేవతా స్వరూపం యొక్క మూర్తిని పూజ చేయడానికి వీలుగా మనం కూర్చునే స్థానానికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి. కావలసిన పూజ సామగ్రిని చేతికి అందుబాటులో ఉంచుకుని కూర్చోవాలి. దుర్ముహూర్తం, వర్జ్యం కాని సమయం చూసుకుని పూజ మొదలు పెట్టలి.
ప్రతి పూజకు ప్రారంభంలో పూర్వాంగం ఉంటుంది. ఇది అన్ని పూజలకు సామాన్యంగా ఉంటుంది.

1. శుచిః పంచపాత్రలో నీళ్ళు ఉద్ధరిణతో కుడిచేతిలో పోసుకుని తలమీద జల్లుకోవాలి.
2. ప్రార్థన ఇక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిని చెప్తూ చేతులు జోడించాలి.
3. ఆచమ్య అంటే ఆచమనం. కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టి, మొదటి మూడు నామాలకు ఎడమ చేతితో పంచపాత్రలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని శబ్దం రాకుండా త్రాగాలి. నాలుగవ నామానికి నీళ్ళు విడిచిపెట్టి, తర్వాతి నామాలకు నమస్కారం చేయాలి. సాంప్రదాయాన్ని బట్టి మిగిలిన నామాలకు శరీర అంగములను స్పృశించవచ్చు.
4. దీపారాధనం దేవతా మూర్తికి రెండు వైపులా చెరియొక దీపం వెలిగిస్తూ ఈ శ్లోకం చెప్పాలి. మూడవ దీపం ఉపచార పూజలో వేరే శ్లోకం చెప్పి వెలిగించాలి. దీపానికి గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు, కొన్ని అక్షతలు వేయాలి.
5. భూతోచ్ఛాటనం ఈ శ్లోకం చెప్పి అక్షతలు ముక్కు దగ్గర పెట్టుకుని కళ్ళుమూసుకుని వాసన చూసి ఎడమ భుజం ప్రక్కగా వెనక్కి వేయాలి.
6. ప్రాణాయామం ఈ శ్లోకం చదివి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం కనీసంగా మూడుసార్లు చేయాలి. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. ఇవి నాలుగు సెకండ్ల చప్పున చేయాలి.
7. పూరకం కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కుపుటం మూసి, ఎడమ ముక్కుపుటం ద్వారా శ్వాస తీసుకోవాలి.
8. కుంభకం కుడి ఉంగరం, చిటికిన వేళ్ళతో ఎడమ ముక్కుపుటం మూసి, బొటన వేలితో కుడి ముక్కుపుటం మూసి, శ్వాసని ఆపాలి.
9. రేచకం కుడి ఉంగరం, చిటికిన వేళ్ళతో ఎడమ ముక్కుపుటం మూసి, కుడి ముక్కుపుటం తెరిచి దాని ద్వారా  శ్వాసని వదలాలి.
10. సంకల్పం అక్షతలు కుడి చేతిలో తీసుకుని సంకల్పం చదువుకోవాలి. పంచాంగం దొరకని పక్షం లో దేశకాల సంకీర్తనం లో శుభఅని చెప్పుకోవచ్చు. చివరిలో కరిష్యేఅన్నప్పుడు ఎడమ చేతితో ఉద్ధరిణతో పంచపాత్రలో నీళ్ళు తీసుకుని కుడి చేతి వేళ్ళమీదుగా అక్షతలు జారిపడేడట్టు అరివేణం లో విడిచిపెట్టాలి.
11. కలశారాధనం కలశానికి పెట్టిన చెంబుకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టాలి. ఒకటిగానీ, మూడుగానీ, అయిదు గానీ బొట్లు పెట్టవచ్చు. తర్వాత కలశం నీళ్ళలో గంధం, అక్షతలు వేసి ఒక పువ్వు వేయాలి. మామిడి ఆకులు ఉంటే అవి ౩ కానీ 5 కానీ తీసుకుని, తొళ్ళిక నీటిలో, కొస ఆకాశానికి ఉండేలా వేయాలి. వేసిన పువ్వునిగానీ మామిడాకులను కానీ కుడి చేతివేళ్ళతో పట్టుకుని కలశాన్ని స్పృశిస్తూ శ్లోకం చెప్పాలి. ఆపోవా ఇదగంఅన్నప్పుడు కలశంలో నీళ్ళను కుడిచేతి ఉంగరం వేలితో స్పృశించాలి. సంప్రోక్ష్యఅన్నప్పుడు నీళ్ళను పూజా సామాగ్రి మీద, దేవతా ప్రతిమ మీద, మీ తలమీద జల్లుకోవాలి.
12. శంఖపూజ శంఖం అందుబాటులో ఉంటేనే ఇది చేయండి. ప్రత్యేకంగా అభిషేకం చేయాలనుకుంటే శంఖం ముందుగా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోండి. కలశంలోని నీళ్ళను కొంచెం శంఖంలోకి తీసుకుని, శంఖానికి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి, శంఖం నీటిలో గంధం మరియు అక్షతలు వేసి, శంఖం మీద ఒక పువ్వు పెట్టి ఈ శ్లోకం చదవాలి. తర్వాత ఆ నీళ్ళను తిరిగి కలశంలో పోసి, శంఖాన్ని దేవతా ప్రతిమ వద్ద ఉంచండి.
13. ఘంటపూజ ఘంటకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి ఒక పుష్పం, అక్షతలు వేసి ఈ శ్లోకం చదవాలి.
14. ఘంటానాదం ఘంటకి నమస్కారం చేసి కుడిచేతిలో తీసుకుని ఈ శ్లోకం చదువుతూ వాయించాలి.

తరవాత గణపతి పూజ ఉంటుంది. లఘు పూజకానీ, షోడశోపచార పూజ కానీ చేయవచ్చు. పిమ్మట ప్రధాన దేవతార్చన ఉంటుంది.
ఉపచారాలు వాటి పద్ధతులు
ఉపచారం అంటే సేవ. చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం. భావన బలంగా ఉంటే కేవలం అక్షతలు వేసినా దేవతకు విశేష ఉపచారం చేసినట్లే. దేవతకి మనం దాసులం అని భావన చేస్తూ ఈ ఉపచారాలు చేయాలి. షోడశోపచార పూజలో పదహారు ఉపచారాలు ఉంటాయి. వాటిలో అయిదు ఉపచారాలు పంచోపచారాలలో కూడా వస్తాయి.
పంచోపచారాలు:
1. గంధం
2. పుష్పం
3. ధూపం
4. దీపం
5. నైవేద్యం
పంచోపచార పూజ చేయాలనుకుంటే సంకల్పం లో పంచోపచార పూజాం కరిష్యేఅని చదువుకోవాలి. తర్వాత ధ్యాన శ్లోకాలు చదివి పైన ఇచ్చిన అయిదు ఉపచారాలు చేయాలి. ఉపచార విధానం ఈ క్రింద ఇవ్వబడింది.


షోడశోపచారాలు :
1.      ధ్యానం :
 దేవతా స్వరూపాన్ని పూర్ణంగా ఊహచేసి, కుడి చేతిలో అక్షతలు పట్టుకుని మీరు పూజ చేయాలనుకున్న దేవాతా స్వరూపాన్ని వర్ణించే ధ్యానశ్లోకాలు చెప్పుకోవాలి. తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
2. ఆవాహనం :
  ధ్యానంలో గోచరమైన స్వరూపాన్ని మన కళ్ళకు ఎదురుగా ఉన్న ప్రతిమలోకి వచ్చినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
3. ఆసనం
   ఆవాహన చేసిన దేవతా స్వరూపానికి మన ఎదురుగా ఒక స్థానంలో కూర్చుని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి, మన ఎదురుగా దాన్ని వేసినట్టు, దేవతా స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఊహించాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
4. పాద్యం :
 సింహాసనం లో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ళ క్రింద పెద్ద పళ్ళెం పెట్టి గంగాది సర్వతీర్థాలలోంచి మంచి నీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాలమీద పోసినట్టు, తర్వాత ఆ నీళ్ళు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని నీళ్ళు దేవతా మూర్తి పాదాల మీద జల్లాలి.
5. అర్ఘ్యం :
  మన ఎదురుగా ఉన్న దేవతా స్వరూపానికి మన దోసిట నిండా నీళ్ళు తీసుకుని, ఆ దేవతా స్వరూపం యొక్క చేతులలో పోసినట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని కొద్ది నీరు తీసుకుని అరివేణంలో విడవాలి.
6. ఆచమనీయం :
   పూజ పూర్వాంగం లో మనం ఆచమనం చేసినట్టు, దేవతా స్వరూపం కూడా ఆచమనం చేస్తున్నట్టు భావన చేయాలి. కుడి చేతితో కలశం లో నీళ్ళు ఉద్దరిణతో తీసుకుని, దేవతా స్వరూపం నోటికి అందించినట్టు భావన చేసి, అరివేణంలో మూడుసార్లు విడవాలి.
7. అభిషేకం (స్నానం) :
    అభిషేకం లో మూడుభాగాలు పంచామృత అభిషేకం, ఫలోదక అభిషేకం, శుద్ధోదక అభిషేకం. పంచామృత అభిషేకానికి ఐదు పదార్థాలు కావాలి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర. ఇవి కలిపికానీ విడివిడిగా కానీ అభిషేకం చేయవచ్చు. ఫలోదకం కోసం కొబ్బరినీళ్ళు కానీ పళ్ళరసాలు గానీ వాడవచ్చు. శుద్ధోదకం కోసం కలశం నీళ్ళు వాడాలి. దేవతా మూర్తిని ఒక పెద్ద పళ్ళెం లో పెట్టి, ఉన్న పదార్థాలతో అభిషేకం చేయాలి. పంచామృత స్నానం, ఫలోదక స్నానం సాధ్యం కాకపోతే కలశంలోని నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. విడిగా అభిషేకం చేయడం కుదరకపోతే, కలశంలోని నీళ్ళను అందులో ఉన్న పువ్వుతోగానీ మామిడాకులతో గానీ తీసుకుని దేవతా మూర్తి మీద చిలకరించవచ్చు. బ్రహ్మాండం మొత్తం వ్యాప్తమైన దేవతస్వరూపానికి అభిషేకం చేస్తున్నట్టు భావన చేయాలి.
స్నానం అయ్యాక కలశంలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి. ఇది స్నానానంతరం శుద్ధాచమనీయంఅన్నప్పుడు చేయాలి.
అభిషేకం జరిగిన తరువాత దేవతామూర్తిని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి తిరిగి సింహాసనంలో పెట్టాలి.
8. వస్త్ర యుగ్మం  :
    సింహాసనం లో ఉన్న దేవతకి దివ్య వస్త్రాలు సమర్పించినట్టు భావన చేయాలి. పురుష స్వరూపానికి శ్రేష్ఠమైన పంచె, కండువ ఇచ్చినట్టు, స్త్రీ స్వరూపానికి నాణ్యమైన చీర, రవిక ఇచ్చినట్టు భావన చేయాలి. ఇక్కడ శ్లోకం చెప్పాలి. కుదిరితే నిజమైన వస్త్రాలు, లేకపోతే ప్రత్తితో చేసిన వస్త్రాలు, లేకపోతే అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి. ఇచ్చిన వస్త్రాలను ఆ దేవతా స్వరూపం వేసుకున్నట్టు భావన చేయాలి. భావన మాత్రం ఉన్నతంగా ఉండాలి.
యజ్ఞోపవీతం :
దేవతా మూర్తికి యజ్ఞోపవీతం వేసినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా ప్రతిమ పాదాల వద్ద వేయాలి.
9. ఆభరణం :
 మంచి బంగారు ఆభరణాలతో దేవతను అలంకరించినట్టు భావన చేయాలి. కుదిరితే ఆభరణం చూపాలి, లేదా కుడి చేతితో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, దేవత మూర్తి పాదాల వద్ద వేయాలి.

10. గంధం :
దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్ళకు, కంఠానికి గంధం రాసినట్టు భావన చేయాలి. కుడి చేతితో ఒక పువ్వు తీసుకుని, దానిని గంధంలో ముంచి, శ్లోకం చదివి, దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
11. పుష్పం :
 మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్టు, దోసిట నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్టు భావన చేయాలి. అంగ పూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తున్నట్టు భావన చేయాలి. అష్టోత్తరనామావళి గానీ సహస్రనామావళి గానీ చదువుకోవచ్చు.
నోటితో నామాలు చెప్తూ కుడి చేతితో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి.
12. ధూపం :
 శ్లోకం చెప్పి అగరవత్తులు, లేక సాంబ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి, పక్కన పెట్టాలి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి.
13. దీపం :  
వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. మూడవ దీపం పెట్టడానికి కుదిరితే పెట్టాలి లేకపోతే మొదట వెలిగించిన దీపాలనే చూపాలి. కుడి చేతితో అక్షతలు దీపానికి చూపి అవి దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
14. నైవేద్యం :
 నివేదన కోసం తెచ్చిన పదార్థాలను ఒక పళ్ళెం లో పెట్టి, శ్లోకం చెప్తూ కలశం లోని నీళ్ళను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను కానీ కుడి చేతితో పట్టుకుని, గాయత్రీ మంత్రం చదివిన తరువాత నైవేద్యం చుట్టూ తిప్పి స్వాహాఅన్నప్పుడు దేవతా మూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్లు భావన చేయాలి.
తినడం అయ్యాక చేతులు, కాళ్ళు, ముఖం (నోరు) కడిగినట్టు భావన చేసి, కలశంలో నీళ్ళను ఉద్దరిణతో అరివేణంలోకి విడవాలి. తర్వాత ఆచమనీయం అన్నప్పుడు మూడుసార్లు కలశం లోని నీరు అరివేణంలోకి విడవాలి.

15. తాంబూలం :
     నివేదన అయ్యక తమలపాకును చుట్టి దేవత స్వరూపనికి ఇచ్చినట్టు, అది ఆ దేవత నోటిలో పెట్టుకుని నమిలినట్టు భావన చేయాలి. శ్లోకం చెప్పి, కుడి చేతితో తాంబూలం ఆకులు, వక్కలు తీసుకుని దేవతా మూర్తికి ఒక ప్రక్కగా ఉంచాలి. తాంబూలం లభ్యం కాని పక్షంలో అక్షతలు తీసుకుని శ్లోకం చదివి, ఆ దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
16. నీరాజనం :
    లేచి నిలబడి, హారతి వెలిగించి, ఘంట వాయిస్తూ, దేవతా స్వరూపానికి పాదాల నుంచి మూర్తికి కుడి చేతి వైపుగా మూడుమార్లు తిప్పాలి. హారతి తిప్పుతున్నప్పుడు ఆ దీప కాంతిలో మీరు అలంకరించిన దేవతా మూర్తిని పరిశీలించి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత హారతిపళ్ళెం పక్కన పెట్టి, దానికి ఒక ప్రక్క కలశంలోని నీళ్ళను చిలకరించి, హారతిని కళ్ళకు అద్దుకుని, కలశంలో నీళ్ళు ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి.
మంత్రపుష్పం :
 అక్షతలు, పువ్వులు చేతిలోకి తీసుకుని, ఇచ్చిన శ్లోకం గానీ మంత్రపుష్పంగానీ చదివి, దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.
ప్రదక్షిణ :
మళ్ళీ అక్షతలు తీసుకుని, శ్లోకం చెప్తూ, మనకు కుడివైపుగా మూడుసార్లు ప్రదక్షిణగా తిరగాలి. చేతిలోని అక్షతలు దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.
పునః పూజ రాజయోగ్యమైన ఉపచారాలు చేస్తున్నట్టు భావన చేయాలి. శ్లోకాలు చెప్పి అక్షతలని కుడి చేతితో తీసుకుని దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
అర్పణ :
 అక్షతలు కుడి చేతిలోకి తీసుకుని ఉద్ధరిణతో కలశం లోని నీరు తీసుకుని, శ్లోకం చెప్పి, అరివేణంలోకి విడవాలి.
తీర్థస్వీకరణ :
 శ్లోకం చదువుకుంటూ అభిషేక జలాన్ని కానీ, లేకపోతే కలశం లోని నీటిని గానీ ఉద్ధరిణతో తీసుకుని, మూడు సార్లు కుడి అరచేతిలో వేసుకుని శబ్దం రాకుండా తాగాలి.

ఓం శాంతిః శాంతిః శాంతిఃఅన్నప్పుడు దేవతా మూర్తి పాదల వద్ద ఉన్న అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకుని, కళ్ళుమూసుకుని నమస్కారం చేసి మన చుట్టూ ప్రశాంతత నెలకొన్నట్టు భావన చేయాలి.
ఇది క్లుప్తంగా ఇవ్వబడిన పూజా విధానం. మరింత వివరంగా మీ పెద్దలవల్లగానీ, పురోహితులవల్లగానీ, గురువు వద్దగానీ తెలుసుకోగలరు.

No comments:

Post a Comment