Monday 25 June 2018

హిందూ ఆరాధ్య గ్రంధాలు వాటి వివరాలు,సమగ్ర సమాచారం :

హిందూ ఆరాధ్య గ్రంధాలు వాటి వివరాలు,సమగ్ర సమాచారం : 
Image result for హిందూ గ్రందాలు
సనాతన ధర్మం లో వేదాలు ,ఉపనిషత్తులు,రామాయణం ,భారతం ,భగవత్ గీత,పురాణాలు 18 గా వున్నాయి.ఇక 18 పురాణాలు వాటి వివరాలు చూస్తే,
శ్రీ మహా విష్ణువు యొక్క అంశం వల్ల జన్మించిన వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు,వేద విభాగం,బ్రహ్మ సూత్ర రచన,మహాభారత రచనలు చేసాడు.ఈ పురాణాలను రచించినది వ్యాసమహర్శే అయినా అవి లోకానికి తెలియచేసినవారు సూతమహాముని.ఆయన పురాణాలు చెబుతున్న సమయంలో వాటిని శ్రవణం చేసిన వారు మొదటగా శౌనక మహర్షి కాగా,మరో ఎనభై ఎనిమిది వేల మంది(88,000)ఋషులు మరియూ నైమిశారణ్య వాసులు.ఇక వాటి వివరాలను చూస్తే
శ్లో|| మద్వయం భద్వయంచైవ
బ్రత్రయం వచతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షత.||
భావం :
A)"మద్వయం" అనగా మకారం తో రెండు
1)మత్స్య పురాణం 2)మార్కండేయ పురాణం,
😎"భద్వయం"భ కారంతో రెండు
1)భాగవత 2)భవిష్యద్ పురాణం
C)"బ్రత్రయం" "బ్ర"కారం తో మూడు
1)బ్రహ్మ 2)బ్రహ్మ వైవర్త 3)బ్రహ్మాండ
D)"వచతుష్టయం":"వ" కారంతో నాలుగు.1)వాయు 2)వరాహ 3)వామన 4)విష్ణు పురాణం
E)అకారం తో అగ్నిపురాణం
F)నకారంతో నారద పురాణం
G)ప కారం తో పద్మ పురాణం
H)లింకారం తో లింగపురాణం
I)గకారంతో గరుడ పురాణం
J)కు కారం తో కూర్మ పురాణం
K)స్క కారం తో స్కాంద పురాణం గా రచించారు .
పురాణం యొక్క లక్షణం:
పురాణానికి ముఖ్యం గా ఐదు లక్షణాలు ఉంటాయి.
అవి a)సర్గ-అంటే ప్రపంచ సృష్టి
b)ప్రతి సర్గ-ప్రపంచ ప్రళయం
C)వంశం-రాజుల,ఋషుల,దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు-
అవతారాలు.
d)వంశానుచరితం-రాజ వంశాలలో,ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవిత చరిత్రలు e)మన్వంతరాలు- మనువులు,మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి,ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు,ఇలా ప్రతి పురాణం పంచలక్షణాలతో కూడి ఉంటుంది.ఇక ఒక్కో పురాణం గురించి చూస్తే
1)మత్స్య పురాణం:
దీనిలో మొత్తం 14,000/శ్లోకాలు వున్నాయి.ఇది ఈ అవతార మెత్తిన విష్ణువుచే మనువుకు చెప్పబడింది.
ఇందులో కార్తికేయ,యయాతి,సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు,ప్రయాగ,వారణాసి మొదలైన పుణ్యక్షేత్రాల మహత్యాలు చెప్పబడ్డాయి.ఈ పురాణాన్ని సప్తకల్పం లో మనువు కు చెప్పబడింది.
2)మార్కండేయ పురాణం
ఇందులో 9,000/శ్లోకాలు వున్నాయి.ఇది శ్వేతవరాహకల్పం లో మార్కండేయుడు జైమిని మహామునికి చెప్పబడింది.
ఇందులో,శివ విష్ణువుల మహత్యాలు,
ఇంద్ర,అగ్ని,సూర్యుల మహత్యాలు మరియూ సప్తశతి,చండీ హోమం,శత చండీ,సహస్ర చండీ హోమ విధానాలకు ఆధారమైనదే ఈ సప్తశతి.
3) భాగవత పురాణం
దీనిలో 18,000/శ్లోకాలు వున్నాయి.ఇది సారస్వత కల్పం లో విష్ణువు ద్వారా బ్రహ్మకు,తద్వారా వ్యాసునకు,తరువాత ఆయన కుమారుడైన శుకునకు,ఆయన వలన పరీక్షిత్ మహారాజునకు చెప్పబడింది ఇందులో 12 స్కందాలలోని మహావిష్ణు అవతారాలు,శ్రీ కృష్ణ జనన,లీలా చరితాలు వివరింపబడ్డాయి.
4)భవిష్య పురాణం
దీనిలో14,500/శ్లోకాలు వున్నాయి.దీనిని ఇద్దరు అఘోరకల్పంలో బ్రహ్మ ద్వారా మనువుకు, చెప్పబడింది.
దీనిలో సూర్యోపాసనా విధి,అగ్ని దేవతారాధన విధానం,వర్ణాశ్రమ ధర్మాలు,రాబోయేకాలం విశేషాలు ఇందులో చెప్పబడింది.
5)బ్రహ్మ పురాణం
దీనినే ఆది పురాణం లేక సూర్య పురాణం అంటారు.
దీనిని బ్రహ్మ కల్పం లో బ్రహ్మదేవుడు మరీచి మహామునికి బోధించాడు.
దీనిలో 10,000/శ్లోకాలు వున్నాయి.ఇందులో శ్రీకృష్ణ,కశ్యపుల చరిత్రల వర్ణనలు,వర్ణ ధర్మాలు,ధర్మాచరణలు,స్వర్గ-నరకాలను గురించి చెప్పబడింది.
6)బ్రహ్మాండ పురాణం
దీనిని భవిష్యకల్పం లో బ్రహ్మ మనువుకు బోధించాడు.
దీనిలో12,000/శ్లోకాలు వున్నాయి,ఇందులో రాధాదేవి,శ్రీకృష్ణుడు,పరశురామ,శ్రీ రామచంద్రుల చరిత్ర,శ్రీ లలిత,శివ కృష్ణ స్తోత్రాలు,గాంధర్వం,ఖగోళ శాస్త్రం,స్వర్గ నరకాల గురించి చెప్పబడింది.
7)బ్రహ్మ వైవర్త పురాణం
దీనిని రధంతర కల్పం లో సావర్ణి నారదుడికి బోధించాడు.దీనిలో 18,000/ శ్లోకాలు వున్నాయి.దీనిలో స్కాంద,గణేశ,రుద్ర,శ్రీ కృష్ణుల వైభవములు,సృష్టికర్త బ్రహ్మ,సృష్టికి కారణమైన భౌతిక జగత్తు,
దుర్గా,లక్ష్మీ,సరస్వతి,సావిత్రి,రాధ మొదలైన పంచశక్తుల ప్రభావం గురించి చెప్పబడింది.
8)వరాహ పురాణం
దీనిని మనుకల్పంలో విష్ణువు చే భూదేవి కి చెప్పబడింది.దీనిలో 24,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో విష్ణుమూర్తి ఉపాసనా విధానం ఎక్కువగా కలదు,పరమేశ్వరీ పరమేశ్వరుల చరిత్రలు,ధర్మశాస్త్రము,వ్రతకల్పాలు,పుణ్య క్షేత్ర వర్ణనలు వున్నాయి.
9)వామన పురాణం
దీనిని కూర్మ కల్పంలో బ్రహ్మ దేవుడు పులస్త్య మహామునికి బోధించాడు.దీనిలో 10,000/శ్లోకాలు వున్నాయి.పులస్త్య ఋషి నారద మహర్షి కి మళ్ళీ బోధించడం జరిగింది.ఇందులో శివలింగ ఉపాసన,
శివపార్వతుల కళ్యాణం,శివగణేశ,కార్తికేయ చరిత్రలు,భూగోళం-ఋతు వర్ణనలు వివరించారు.
10) వాయు పురాణం
దీనిని శ్వేతా కల్పం లో శివుడి ద్వారా వాయువుకు చెప్పబడింది,దీనినే శివపురాణం అని కూడా పిలుస్తారు.దీనిలో 24,000/ శ్లోకాలు వున్నాయి,దీనిలో శివభగవానుని మహత్యము,కాలమానము,భూగోళం,సౌరమండల వర్ణనము చెప్పబడింది.
11)విష్ణు పురాణం
దీని వరాహ కల్పం లో పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు.దీనిలో 23,000/ శ్లోకాలు వున్నాయి,ఇందులో విష్ణు మహత్యము,
శ్రీకృష్ణ,ధ్రువ, ప్రహ్లాద,భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి.
12)అగ్నిపురాణం
దీనిని ఈశాన కల్పం లో అగ్నిభట్టారకుడు వసిష్ఠుడికి బోధించాడు,దీనిలో 15,400/శ్లోకాలు వున్నాయి.దీనిలో శివ,గణేశ,దుర్గా,భగవదుపాసన,వ్యాకరణం,ఛందస్సు,వైద్యం,లౌకిక ధర్మాలు,రాజకీయం, భూగోళ,ఖగోళ శాస్త్రాలు,
జ్యోతిష్యం మొదలగు విషయాలు చెప్పబడ్డాయి.
13)నారద పురాణం
దీనిని బృహత్ కల్పం లో పూర్వ భాగాన్ని సనకాదులు నారదునికి భోధించగా,ఉత్తర భాగాన్ని వసిష్ఠుడు మాంధాత కు బోధించాడు.
దీనిలో25,000/శ్లోకాలు వున్నాయి,దీనిలో నారదుడు,సనక,సనందన, సనత్కుమార సనాతన అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పిన పురాణం.ఇది అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివ స్తోత్రము)చెప్పబడింది.ఇందులో వేదాంగములూ,
బదరీ,ప్రయాగ,వారణాసి క్షేత్ర వర్ణనలు చెప్పబడ్డాయి.
14)స్కాంద పురాణం:
దీనిని తత్పురుషకల్పం లో స్కందుడు(కుమారస్వామి) భూదేవి కి బోధించాడు.దీనిలో 81,000/శ్లోకాలు వున్నాయి.ఇందులో శివచరిత్ర వర్ణనలు,స్కందుని మహాత్యములు,ప్రదోష స్తోత్రములు,కాశీఖండము, కేదార ఖండము, రేవా ఖండము,మనము చాలా చూస్తుండే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇందులోనే చెప్పబడింది,
వైష్ణవ ఖండము( వేంకటాచల క్షేత్రము),
ఉత్కళ ఖండము(జగన్నాధ క్షేత్రము),
కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము),
బ్రహ్మ ఖండము(రామేశ్వర క్షేత్రము),
బ్రహ్మోత్తర ఖండము(గోకర్ణ క్షేత్రము,ప్రదోష పూజ),
అవంతికా ఖండము(క్షీప్రానదీ,మహాకాల మహత్యము)మొదలగునవి చెప్పబడ్డాయి.
15)లింగ పురాణం
దీనిని కల్పాంత కల్పం లో పరమశివుడు నారదునికి బోధించాడు.దీనిలో శివుని ఉపదేశాలు,లింగ రూప శివమహిమ,దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతాలు,ఖగోళ,భూగోళ,జ్యోతిష్య శాస్త్రాలు ఇందులో చెప్పబడ్డాయి.
16)గరుడ పురాణం
దీనిని గరుడ కల్పం లో విష్ణువుచే గరుత్మంతునికి బోధించడం జరిగింది.దీనిలో 19,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో మహావిష్ణు ఉపాసన,గరుత్మంతుని ఆవిర్భావ వివరణ,జనన మరణాలు,జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు,శిక్షలు మొదలైనవి చెప్పబడ్డాయి.
17)కూర్మ పురాణం
దీనిని లక్ష్మీ కల్పం లో విష్ణువు పౌలస్త్య ముని కి చెప్పబడింది.దీనిలో 17,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో వరాహ,నారసింహ అవతారాలు,లింగరూప శివారాధన,ఖగోళము,భూగోళంలో వారణాసి,ప్రయాగ క్షేత్ర వర్ణనలు చెప్పబడ్డాయి.
18)పద్మ పురాణం
జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం విన్నంత మాత్రాననే పోగొట్టగలిగేదే ఈ పద్మపురాణం.అన్ని పురాణాలలో కెల్లా అత్యధిక శ్లోకాలు గల పురాణం కూడా ఇదే.దీనిని పద్మ కల్పం లో బ్రహ్మ స్వాయంభువ మనువుకు బోధించడం జరిగింది.దీనిలో 85,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో మధుకైటభ వధ,బ్రహ్మ సృష్టి కార్యము,గీతార్ధ సారం-పఠన మహత్యం,గంగా మహత్యం ,పద్మగంధి దివ్యగాథ,గాయత్రీ చరితము,రావి వృక్ష మహిమ,విభూతి మహత్యం, పూజా విధులు-విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో చెప్పబడింది.ఇవేకాక శివపురాణం,కార్తీక పురాణం,మాఘ పురాణం అని మరికొన్ని పురాణాలు కూడా ప్రసిద్ధి చెందాయి.
సశేషం

No comments:

Post a Comment