Monday 25 June 2018

తమిళ నాడు రాష్ట్రం లోని ఈరోడ్ జిల్లాలో కొడుముడి పట్టణంలో ముఘ్దేశ్వర దేవాలయం

శ్రీ ముఘ్దేశ్వర దేవాలయం 🌼
ఈ దేవాలయం తమిళ నాడు రాష్ట్రం లోని ఈరోడ్ జిల్లాలో కొడుముడి పట్టణంలో వుంది.
సహజంగా ఎక్కడైనా బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులకు వేరువేరుగా దేవాలయాలు వుంటాయి.కానీ త్రిమూర్తులైన వీరు ముగ్గురూ ఒకేచోట కొలువై వున్న దేవాలయం ఈ కొడుముడి ముఘ్దేశ్వర దేవాలయం.
ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు.ఒక పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి,వాయు దేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారట.
ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయు దేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి మేరు పర్వత శిఖరం అయిదు ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందట.అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుముడిలో పడి శివలింగ రూపం దాల్చిందట.అదే ముఘ్దేశ్వర శివలింగం.
శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చాడట. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం,దేవ తీర్థం,బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.
💮 విష్ణు మూర్తి :-
ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు.పెళ్లి కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాదు రాహు కేతువులకు కూడా పరిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి.
Image may contain: sky and outdoor
💮బ్రహ్మ దేవుడు :-
ఇక బ్రహ్మ దేవుడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం.వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాలనాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు.ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు. అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం.ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి.
కావేరి నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మొత్సవాలకి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉత్సవమూర్తులని రథంపై తిరువీధిలో తిప్పుతారు.నవగ్రహ పూజలకు,నవగ్రహ శాంతి హోమాలకి పేరుపొందిన ఈ ఆలయం నిజంగా చూడతగ్గది ...

No comments:

Post a Comment