ముక్కోటి ఏకాదశి విశిష్టత మరియు అచారించవలిసిన నియమములు :
అలా ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చిన శ్రీ మహా విష్ణుని 3 కోట్ల దేవతలు దర్శనం చేసుకుంటారు. అందుకనే ఆ పర్వ దినాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు.
శ్రీ మహా విష్ణువు వైకుంఠం నుండి ఉత్తరద్వారం గుండా బయటకు వచ్చి దర్శనం ఇచ్చే ఏకాదశి.ఉత్తరం కుబేర స్థానం.కుబేరుడు ఐశ్వర్యానికి, నవనిధులకు అధిపతి.ఉత్తర ద్వారం గుండా వచ్చే శ్రీ మహా విష్ణువు యొక్క దర్శనం ఐశ్వర్య ప్రదం.(ఐశ్వర్యం అంటే మనకు కావాలిసినది ,కావాల్సినంత,కావాల్సిన సమయానికి దొరకడం,అది మనం తృప్తిగా అనుభవించగలగడం)
ఆరోజు శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుట వలన 3 కోట్ల దేవతలను దర్శించిన ఫలితం వస్తుంది.ఎందుకంటే వారూ అక్కడే వుంటారు కాబట్టి.( మన కళ్ళకు కనపడనంత మాత్రాన అది లేదు అనలేము..అంతటి శక్తి పొందడానికి ఆ భగావంతుడిని నమ్మకంగా పట్టుకోవాలి).
ఉపవాసం :
ఉపవాసం అంటే దగ్గరగా ఉండుట అని అర్ధం.భగవంతుడికి దగ్గరగా ఎప్పుడు వెళ్లగలం...ఆయన స్మరణ చే వెళ్లగలం.శరీరాన్ని నిలబెట్టుకోవడానికి సరిపడా ఆహారం మాత్రమే తీసుకుని రోజంతా భాగవన్నామ స్మరణ చేయాలి.(కాఫీ,టీ, పాలు,పళ్ళు,నీరు వంటివి మాత్రమే తీసుకుని) ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నిద్ర,బద్దకానికి దూరం అయ్యి,శరీరంలో షట్చక్రాలలో వాయూ ప్రసరణ బాగా జరుగుతుంది.ఏకాగ్రత బాగా కుదురుతుంది.
ద్వాదశి నాడు అంటే ఆ మరునాడు ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా పారణ చేయాలి అంటే ఆహారాన్ని తీసుకోవాలి .ఇది ఏకాదశి వ్రతం.
ఫలితం :
ముక్కోటి ఏకాదశి వ్రతం చెయ్యడం వల్ల కోటి ఏకాదసులు ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది.
ముక్కోటి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి,తలకి స్నానం చేసి,దీపారాధన చేసుకుని,మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి ,విశేషించి ఉత్తర ద్వారం ఉన్న ఆలయానికి ,ఆ ద్వారం గుండా వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుని,ఉపవాసం చేసి,మరునాడు సూర్యోదయానికి ముందే లేచి,తలకి స్నానం చేసి ,దీపారాధన చేసుకుని,వెంటనే భోజనం చేయవలెను.
*దానం*
ముక్కోటి ఏకాదశి నాడు చేసే దానం ,1000 రేట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది.
🙏మీ దగ్గర ఉన్న వస్తువులు మీకు అక్కర్లేనివి, ఆ వస్తువుల అవసరం ఉన్నవారికి దయచేసి ఇవ్వండి.ఈ చలి కాలంలో దుప్పట్లు,రగ్గులు దానం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది.
🙏అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది .లేనివారికి అన్నం పెట్టండి.
ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత ఏమిటి..?
అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.
దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును.
ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.
No comments:
Post a Comment