Wednesday, 22 January 2020

పెళ్లికానివారు దర్శించవలసిన క్షేత్రం

Hindhu Temple For Late Marriage :
పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది.
ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా,
వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు.
ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం.
ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు.
అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి
కలిగే సంతానం ఆరోగ్య వంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. .
Image may contain: Ravi Shankar Mudigonda, text
మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో..తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం.
ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే,
ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు.
మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం
ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము
ఈ విధముగా ఉంది.
మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన
సుందర వల్లి, దేవయానీ అమ్మలు.
వీరు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు.
మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు.
మన పురాణములలో చెప్పే వాఖ్యానములకు
అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి.
అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు.
వాటిలోని సూక్ష్మములను తెలుసుకోవాలని పురాణాలు చెతున్నాయి
అయితే ఒక రోజు సుందరవల్లి, దేవయానీ (అమృత వల్లి) అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు.
అప్పుడు స్వామి అమృత వల్లితో 'నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు.
తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను'
అని అభయం ఇస్తారు.
అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.
తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి ఇంద్రుడిని కలిసి ' నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది' అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి
వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు.
ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది.
ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు
అన్నీ తానై సాకుతుంది.
అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో 'యానై' అంటే ఏనుగు).
అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది.
ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు.
తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు.
అది వల్లీ కళ్యాణ ఘట్టం.
వేరే అఖ్యానంలో వివరిస్తాను.
ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు.
వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది.
ఈ క్రమంలో తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత,
మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు.
స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, తిరిగి వారి రూపం వచ్చి,
వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు.
అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు.
అక్కడే ఉన్న బ్రహ్మకి, శ్రీ మహా విష్ణువుకి ఇంద్రుడు
తన ఈ కోర్కెని తెలియజేస్తాడు .
బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు,
స్వామి అంగీకరిస్తారు.
అటు పై సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది.
శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది.
అంతే కాకుండా ఇక్కడకు వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు.
అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు.
దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు.
రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.
ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది.
ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది.
అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు.
మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు,
పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది.
ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము,
విఘ్నేశ్వర వాహనం మూషికము,
శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు.
ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము.
ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు,
ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ,
కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు.
ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు,
కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు.
అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు
'కర్పగ వినాయగర్' అనే పేరుతో ఉంటారు.
ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు.
దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు.
దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు,
కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు.
శివలింగం ఎదురుగా పెరుమాళ్,
అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు.

No comments:

Post a Comment