Wednesday 29 January 2020

శ్రీపంచమి రోజు మీ సంతానం అక్షరాభ్యాసం చేయిస్తే ..? sri panchami festival for child better education life

 శ్రీపంచమి రోజు మీ సంతానం అక్షరాభ్యాసం చేయిస్తే ..?
 sri panchami festival for child better education life 


మాఘమాసం శుక్లపక్ష పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, సరస్వతి జయంతి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. వసంత రుతువు రాక సూచించే ఈ పంచమిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రుతు సంబంధమైన ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రస్తావించారు. ఎంతో శుభకరమైన పంచమి గురించి దేవీభాగతం, బ్రహ్మాండ పురాణాల్లో విశేషంగా చెబుతున్నాయి. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. 
                     

శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపారమైన జ్ఞానం లభిస్తుంది. నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. మాఘ శుక్ల పంచమి నాడు, విద్యారంభం నాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబా ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి.

తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్లవస్త్రాలతో అర్చించాలి. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మవారిని పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న తదితర పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత చిన్నారులకు విద్యారంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు.

ఇంకా వసంత పంచమి అని పిలువబడే శ్రీ పంచమి రోజున కేసర్ హల్వా, పంచదార, పిండితో చేసిన వంటకాలు, కుంకుమ పువ్వు, యాలకులు, పెన్నులు, పుస్తకాలను వుంచి పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి.
గోదావరి తీరాన బాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీ ఆరాధిస్తూ అక్కడే వేద వ్యాసుడు తపస్సు చేశారట. అమ్మ సాక్షాత్కారం పొంది ఆమె అనుగ్రహంతోనే వేద విభజన, మహాభారతం, అష్టాదశ పురాణాలను రచించాడని అంటారు. అందుకే బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు అమ్మకరుణతో జ్ఞానవంతులు అవుతారు ,విద్యలో అందరికన్నా ముందు వుంటారు. 

 శ్రీపంచమి రోజున సరస్వతీ దేవిని తెల్లని పుష్పాలతో పూజించి, అమ్మవారిని శ్వేత లేదా పసు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి, నేతితో పిండివంటలు, చెరకు, అరటి పండ్లు, నారికేళం నివేదించాలి. అమ్మవారిని ఇలా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది. కుల మత భేదాలు లేకుండా ప్రపంచంమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుది. పుష్య, మాఘ ద్వయంతో కూడిన ఆదివారం రోజున శ్రీపంచమి వస్తే, ఆరోజున సూర్యారాధన వల్ల కోటి గ్రహణ స్నానపుణ్య ఫలం లభిస్తుంది.

No comments:

Post a Comment